Russia: ఉక్రెయిన్ పై దాడుల్లో రష్యా రసాయన ఆయుధాలు వాడుతోంది: అమెరికా ఆరోపణ

  • శ్వాస ఆడకుండా చేసి చంపగల క్లోరోపిక్రిన్ అనే రసాయనాన్ని వాడుతోందని మండిపాటు
  • రష్యాకు చెందిన 280 మంది వ్యక్తులు, సంస్థలపై ఆర్థిక ఆంక్షల విధింపు
  • రష్యా సైనిక, పారిశ్రామిక సంస్థలకు రుణాలు మంజూరు కాకుండా చూస్తామని వెల్లడి
america accuses russia of using chemical weapons on attacks in ukraine

రష్యాపై అమెరికా మరోసారి మండిపడింది. ఉక్రెయిన్ పై దాడుల్లో రష్యా నిషేధిత రసాయన ఆయుధాలు వాడుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్ బలగాలకు శ్వాస ఆడకుండా చేసి హతమార్చేందుకు క్లోరోపిక్రిన్ అనే చోకింగ్ ఏజెంట్ ను వినియోగిస్తోందని దుయ్యబట్టింది. ఇదేమీ చెదురుమదురు సంఘటన కాదని.. ఉద్దేశపూర్వకంగానే రష్యా సేనలు ఈ రసాయనాన్ని వాడుతున్నాయని విమర్శించింది. కీలక ప్రాంతాల్లో మోహరించిన ఉక్రెయిన్ సైనికులను మట్టుబెట్టి ఆ ప్రాంతాలను చేజిక్కించుకొనేందుకు రష్యా ఈ దారుణానికి పాల్పడుతోందని అగ్రరాజ్యం ఆరోపించింది.

విదేశీ గడ్డపై దండయాత్రకు దిగి తిరుగుబాటును అణచివేస్తున్నందుకు రష్యాకు చెందిన 280 మందికిపైగా వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆర్థిక ఆంక్షల కొరడా ఝళిపించింది. ఇకపై అలాంటి కంపెనీలకు తమ దేశం నుంచి రుణాలు మంజూరు కాకుండా చూస్తామని స్పష్టం చేసింది. రష్యా సైనిక, పారిశ్రామిక స్థావరాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తమ వద్ద అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను ఉపయోగించుకుంటామని వివరించింది. 

అయితే భవిష్యత్తు ప్రజాస్వామ్యానిదే కావాలని కోరుకుంటున్న రష్యన్లకు తమ సంఘీభావం కొనసాగుతుందని అగ్రరాజ్యం వెల్లడించింది. రష్యా ఏకపక్ష దాడిని తిప్పికొడుతున్న ఉక్రెయిన్ పౌరులకు కూడా తమ మద్దతు ఉంటుందని చెప్పింది.

మరోపక్క ఉక్రెయిన్... తమ దేశంపై రెండేళ్లుగా దాడులకు పాల్పడుతున్న రష్యా దళాలు.. సీఎస్, సీఎన్ అనే వాయువులతో నింపిన గ్రెనేడ్లను విసురుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ గ్రెనేడ్ల నుంచి విడుదలయ్యే పొగ వల్ల ఇప్పటివరకు కనీసం 500 మంది తమ సైనికులు విషపదార్థాల బారిన పడ్డారని చెబుతోంది. అలాగే టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల తమ సైనికుడు ఒకరు మరణించాడని తెలిపింది.

1993 నాటి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారం యుద్ధాల్లో క్లోరోపిక్రిన్ లాంటి రసాయన ఆయుధాల వాడకాన్ని ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ నిషేధించింది. 

1914 నుంచి 1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శత్రు దేశాల సైనికులను చంపేందుకు జర్మనీ సేనలు తొలిసారిగా విష వాయువును ప్రయోగించాయి. 

  • Loading...

More Telugu News